అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని తుదముట్టించిన అమెరికా.. డ్రోన్ దాడిలో హతం!
- కాబూల్‌లో ఆదివారం అమెరికా డ్రోన్ దాడి
- విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌గా బైడెన్ అభివర్ణన
- ఇది అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనన్న తాలిబన్ ప్రతినిధి
- బిన్ లాడెన్ హతమయ్యాక పగ్గాలు చేపట్టిన జవహరి
- ట్విన్ టవర్స్‌పై దాడి సూత్రధారుల్లో జవహరి ఒకడు
అమెరికా డ్రోన్ దాడిపై తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. డ్రోన్ దాడి జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారిస్తూనే తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహరిని అంతమొందించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న మాట్లాడుతూ.. ‘విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’గా అభివర్ణించారు.
కాగా, 11 సెప్టెంబరు 2001లో అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా జరిపిన దాడిలో దాదాపు 3 వేల మంది మరణించారు. ఈ దాడి సూత్రధారుల్లో అల్ జవహరి కూడా ఒకరని అమెరికా గుర్తించింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత ఉగ్రవాద సంస్థ పగ్గాలను జవహరి అందుకున్నాడు.