Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.. ఎగ్‌ఫ్రైడ్ రైస్ తిని 100 మంది విద్యార్థులకు అస్వస్థత

100 students in basara IIIT Hospitalized due to contaminated food
  • మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఎగ్‌ఫ్రైడ్ రైస్
  • తిన్న గంటకే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడిన విద్యార్థులు
  • తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని నిజామాబాద్ తరలించామన్న కలెక్టర్
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్
  • విచారణకు ఆదేశించామన్న మంత్రి సబిత
బాసర ట్రిపుల్ ఐటీలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు నిన్న మధ్యాహ్న భోజనంలో ఎగ్‌ఫ్రైడ్ రైస్ పెట్టారు. అది తిన్న గంటకే వారంతా వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. వందమందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 

కొందరికి అక్కడే వైద్యం అందించగా, తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులను నిజామాబాద్ తరలించినట్టు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలంటూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వి.వెంకటరమణను నిజామాబాద్ ఆసుపత్రికి వెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

బాసర ట్రిపుల్ ఐటీలో ఆహారం కలుషితమై వందమందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Basara IIIT
Nirmal District
Telangana
Sabitha Indra Reddy
Harish Rao
Revanth Reddy
Bandi Sanjay

More Telugu News