విడాకులకు సిద్ధమైన గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్-నికోల్ షనాహన్
- సహజీవనం అనంతరం 2018లో వివాహం చేసుకున్న సెర్జీ బ్రిన్-నికోల్ షనాహన్
- మనస్పర్థల కారణంగా ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్న జంట
- మూడేళ్ల కుమార్తె ఉండడంతో విడాకుల విషయంలో గోప్యత
సెర్జీ-నికోల్ 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. సెర్జీకి అంతకుముందే వివాహమైంది. '23 అండ్‌మీ' సంస్థ సహ వ్యవస్థాపకురాలైన ఎన్నే వొజిస్కీని 2007లో వివాహం చేసుకున్న సెర్జీ 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత షనాహన్‌తో సహజీవనం అనంతరం వివాహం చేసుకున్నారు. ఎన్నే వొజిస్కీతో సెర్జీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, మనస్పర్థల కారణంగా సెర్జీ-షనాహన్ గతేడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. సెర్జీ బ్రిన్ సంపద 94 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు 7 లక్షల కోట్లతో ప్రపంచంలోనే ఆరో సంపన్నుడిగా ఉన్నారు.
కాగా, చిన్నారి కస్టడీకి సంబంధించిన వివరాలు బయటకు పొక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో విడాకుల విషయంలో వీరు గోప్యత పాటిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక న్యాయమూర్తిని కూడా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.