కేన్స్ లో నా బ్రాండ్ ఇదే: పూజా హెగ్డే

19-05-2022 Thu 21:49
  • కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారతీయం
  • కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో భారత బృందం
  • ఓ ప్రతినిధిగా కేన్స్ లో అడుగుపెట్టానన్న పూజ 
  • తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని వ్యాఖ్య  
Pooja Hegde attended Cannes Film Festival
ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దక్షిణాది ముద్దుగుమ్మ పూజా హెగ్డే కూడా తళుకులీనుతోంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో కేన్స్ చలనచిత్రోత్సవానికి హాజరైన భారత బృందంలో పూజా హెగ్డే కూడా ఉంది. భారత బృందంలో మాధవన్, తమన్నా, ఏఆర్ రెహమాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు ఉన్నారు. 

కేన్స్ లో ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తానేమీ ప్రత్యేకంగా ఓ బ్రాండ్ తో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు రాలేదని, భారతదేశమే తన బ్రాండ్ అని స్పష్టం చేసింది. ఈ చలనచిత్రోత్సవంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని పూజా పేర్కొంది. 

"ఓ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. భారతీయ సినిమా వైభవాన్ని ఆస్వాదిస్తున్నాను. నిజాయతీగా చెప్పాలంటే ఓ నటిగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను" అని వివరించింది.