Sun Risers Hyderabad: ముంబై ఖాతాలో పదో ఓటమి.. గెలిచినా హైదరాబాద్‌కు తప్పని నిరాశ

SRH pip MI by 3 runs to keep campaign alive
షార్ట్స్‌లో చూడండి
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించినా ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే. ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో కేవలం మూడు పరుగుల తేడాతో నెగ్గడం ఆ జట్టు ఆశలను చిదిమేసింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత రాహుల్ త్రిపాఠి వీర విహారంతో 193 పరుగుల భారీ స్కోరు సాధించిన హైదరాబాద్.. ముంబై ఇండియన్స్‌ను 190 పరుగులకే కట్టడి చేసి విజయాన్ని అందుకుంది. ముంబై స్కిప్పర్ రోహిత్ శర్మ ఎట్టకేలకు బ్యాట్ ఝళిపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ 48 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. 

ఇక, టిమ్ డేవిడ్ అయితే బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు పిండుకున్నప్పటికీ చివరి వరుస బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోవడంతో పోరాడి ఓడింది. మొత్తంగా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి విజయం ముంగిట బోల్తా పడింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన ముంబైకి ఇది పదో పరాజయం కావడం గమనార్హం. హైదరాబాద్‌కు ఇది ఆరో విజయం. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్‌కు మూడు వికెట్లు దక్కాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ విజయమే లక్ష్యంగా ఆడింది. ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠీ, పూరన్ బంతిని పరుగులు పెట్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. గార్గ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42, పూరన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేయగా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. ముంబై బౌలర్లలో రమణ్‌దీప్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది.
Go Back to Shorts
Sun Risers Hyderabad
Mumbai Indians
Rahul Tripathi
IPL 2022

More Telugu News