చట్టం కంటే మతం పెద్దది కాదు.. ముస్లింలు అర్థం చేసుకోవాలి: రాజ్ థాకరే
- ముస్లింల ప్రార్థనలకు వ్యతిరేకం కాదు
- మహారాష్ట్రలో అల్లర్లను కోరుకోవడం లేదు
- ప్రార్థనలను లౌడ్ స్పీకర్లు లేకుండా చేసుకోవాలి
- ఎంఎన్ఎస్ అధినేత సూచనలు
అన్ని మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించాల్సిందేనని, లేదంటే మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా పారాయణాన్ని స్పీకర్లలో వినిపిస్తామంటూ రాజ్ థాకరే లోగడే హెచ్చరించారు. మే 3 నాటికి లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర సర్కారుకు గడువు కూడా పెట్టారు. దీనిపై తాజాగా స్పందిస్తూ మే 3 తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు.
రాజ్ థాకరే వైఖరిని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్రంగా తప్పుబట్టడం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో అసదుద్దీన్ చేస్తున్న పనినే మహారాష్ట్రలో రాజ్ థాకరే చేస్తున్నారంటూ విమర్శించారు. ‘‘మహారాష్ట్రలో శాంతిని చెడగొడదామన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఇక్కడి ప్రజలు, పోలీసులు శాంతియుతులు. రామ్, హనుమాన్ పేరుతో కొత్త ఒవైసీ.. హిందూ ఒవైసీ అల్లర్లు సృష్టించే కార్యక్రమంతో ఉన్నారు’’అని రౌత్ వ్యాఖ్యానించారు.