Chandrababu: అమరావతి రాజధానిగా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని విపక్షనేతగా జగన్ చెప్పారా? లేదా?: చంద్రబాబు

Chandrababu questions CM Jagan over Amaravati Capital
  • మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన
  • తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
  • జగన్ కు నైతిక హక్కు లేదని విమర్శలు
  • ఇలాంటి సీఎంను, మంత్రులను ఎక్కడా చూడలేదని వ్యాఖ్యలు
ఏపీకి మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో నేడు చర్చ జరిగిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ తాజా ప్రకటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని విపక్షనేతగా జగన్ చెప్పలేదా? అని నిలదీశారు. అమరావతిపై అభ్యంతరం ఉంటే అప్పుడే ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. రాజధానికి 30 వేల ఎకరాలు ఉండాలని నాడు జగన్ సూచించలేదా? అని ప్రశ్నించారు. 

ఆనాడు ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి ఇప్పుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. మీరు మూడు రాజధానులపైనే ముందుకు వెళ్లాలనుకుంటే అదే అంశం మీద రాజీనామా చేసి ప్రజల తీర్పును కోరండి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

కాగా, రాజధానులపై నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని, న్యాయవ్యవస్థ తన పరిధి దాటి ఆచరణ సాధ్యం కాని ఆదేశమిచ్చిందని సీఎం జగన్ పేర్కొనడంపైనా చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వాలు ఎలా ప్రవర్తించాలో, వాటి పరిధి ఎంతవరకో రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని అన్నారు. రాజ్యాంగంలో కేంద్రం, రాష్ట్రం మధ్య అధికారాలు స్పష్టంగా విభజించారని వివరించారు. 

ప్రభుత్వాలు చేసిన చట్టాలు అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదేనని, ఈ క్రమంలో ఎవరు బాధ్యతలు విస్మరించినా సరిచేసే బాధ్యత న్యాయవ్యవస్థకు ఉంటుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. తమ ఇష్టప్రకారం చట్టాలు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉండదని స్పష్టం చేశారు. జనాల ప్రాణాలు తీసే చట్టం చేస్తామంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని అన్నారు.

కోర్టు తీర్పులపై ఈస్థాయిలో మాట్లాడిన ముఖ్యమంత్రిని గానీ, మంత్రులను గానీ గతంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసేందుకా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. అమరావతిపై ఎందుకంత వ్యతిరేకతో అర్థంకాదని, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదని వివరించారు.
Chandrababu
Amaravati
CM Jagan
AP Capital
Three Capitals
Andhra Pradesh

More Telugu News