Sandeep Singh Nangal: జలంధర్‌లో దారుణం.. మ్యాచ్ జరుగుతుండగా అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సందీప్ నంగల్ కాల్చివేత.. వీడియో వైరల్

Kabaddi Player Shot Dead In Punjab During Tournament
  • సందీప్ తల, ఛాతీపై కాల్పులు
  • తుపాకి చప్పుళ్లు వినిపించగానే పరుగులు తీసిన ఆటగాళ్లు, ప్రేక్షకులు
  • దశాబ్దానికి పైగా కబడ్డీ ప్రపంచాన్ని ఏలిన సందీప్
అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ నంగల్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మ్యాచ్ జరుగుతుండగానే దుండగులు అతడిని కాల్చి చంపారు. పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లా మలియన్ ఖుర్ద్ గ్రామంలో జరిగిందీ ఘటన. సందీప్ తల, ఛాతీ భాగంలోకి 8 నుంచి 10 బుల్లెట్లు దూసుకెళ్లాయి. తుపాకి చప్పుళ్లు వినిపించగానే క్రీడాకారులు, ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. టోర్నీ జరుగుతుండగా అక్కడకు వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు సందీప్‌ను వెంబడించి మరీ కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

జలంధర్‌లోని షాకోట్‌కు సమీపంలోని నంగల్ అంబియన్ గ్రామానికి చెందిన సందీప్ ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. తరచు కబడ్డీ టోర్నీలు నిర్వహిస్తూ ఉంటాడు. కబడ్డీ ప్రపంచాన్ని సందీప్ దాదాపు దశాబ్దానికి పైగా శాసించాడు. కబడ్డీలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న సందీప్ అద్భుత విజయాలతో కబడ్డీ ప్రపంచంలో తన పేరును చిరస్థాయిగా లిఖించుకున్నాడు. అంతేకాదు, అతడిని ‘డైమండ్ పార్టిసిపెంట్’గా పిలిచేవారు. సందీప్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sandeep Singh Nangal
Punjab
Jalandhar

More Telugu News