ఉక్రెయిన్ కు అమెరికా ఇచ్చిన ఆ ఆయుధాలతో రష్యాకు భారీ నష్టం
- ఉక్రెయిన్ కు అమెరికా జావెలిన్ క్షిపణులు
- వీటి సాయంతో చెలరేగిపోతున్న ఉక్రెయిన్ సైనికులు
- రష్యా యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలపై దాడి
ఉక్రెయిన్ కు అమెరికా జావెలిన్ మిసైల్స్ ను సరఫరా చేసింది. ఇవి భుజాన పెట్టుకుని ప్రయోగించడానికి అనువైన క్షిపణులు. భూతలం నుంచి భూతలం, గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. వీటి సాయంతో ఉక్రెయిన్ సైనికులు ఇప్పటి వరకు కనీసం 300 వరకు రష్యా యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్టు సమాచారం. 93 శాతం ఇవి కచ్చితత్వాన్ని చూపిస్తున్నట్టు స్థానిక వార్తా కథనాల ఆధారంగా తెలుస్తోంది.
అయితే, రష్యా యుద్ధం మొదలైన తర్వాతే అమెరికా జావెలిన్ మిసైల్స్ ను సరఫరా చేసిందని అనుకోవడానికి లేదు. చాలా ముందుగానే 2018లోనే మొదటి విడత సరఫరా చేసింది. తాజాగా యుద్ధం మొదలైన తర్వాత అదనపు సరఫరాలతో చేదోడుగా నిలిచింది. 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు.