Akash Ambani: గాయంతో బాధపడుతున్న ఆటగాడి కోసం రూ.8 కోట్లు.. వివరణ ఇచ్చిన ఆకాశ్ అంబానీ

Aksah Ambani explains why they go for Jofra Archer
  • ముగిసిన ఐపీఎల్ వేలం
  • జోఫ్రా ఆర్చర్ ను సొంతం చేసుకున్న ముంబయి
  • ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న ఆర్చర్
  • ఐపీఎల్ తాజా సీజన్ లో ఆడేది కష్టమే!
ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ స్పీడ్ స్టర్ జోఫ్రా ఆర్చర్ ను ముంబయి ఇండియన్స్ రూ.8 కోట్లతో కొనుగోలు చేయడం తెలిసిందే. ఆర్చర్ ప్రతిభాపాటవాలు ఉన్నవాడు కాబట్టి ఈ ధర సహేతుకమే. కానీ, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన అంశం మరొకటి ఉంది.

వాస్తవానికి ఆర్చర్ గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు చికిత్సలో ఉన్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుకు కూడా ఆడడంలేదు. అలాంటి ఆటగాడి కోసం ముంబయి ఇండియన్స్ వేలంలో రూ.8 కోట్లు ఖర్చు చేయడంపై క్రికెట్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే, ఆర్చర్ ఈ సీజన్ కు అందుబాటులో ఉండడు. తాజా సీజన్ లో ఆడని ఆటగాడి కోసం అన్ని కోట్లు ఎందుకన్నది క్రికెట్ పండితుల అభిప్రాయం.

దీనిపై ముంబయి ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ వివరణ ఇచ్చారు. ఆర్చర్ గాయంతో బాధపడుతున్న సంగతి, అతడు 2022 సీజన్ లో ఆడని విషయం తమకు కూడా తెలుసని అన్నారు. అయితే, ఒక్కసారిగా ఆర్చర్ గాయం నుంచి కోలుకున్నాక, ముంబయి ఇండియన్స్ జట్టులోకి వచ్చి జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేస్తుంటే వారిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాలేనని స్పష్టం చేశారు. బుమ్రా, ఆర్చర్ జోడీ వికెట్ల వేట సాగిస్తుందన్న నమ్మకం తమకు ఉందని అంబానీ పేర్కొన్నారు. ఆర్చర్ గురించి వేలానికి ముందే అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఇక, సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ ను రూ.8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేయడంపైనా అకాశ్ అంబానీ స్పందించారు. ప్రపంచ క్రికెట్లో ఇప్పుడున్న బెస్ట్ ఫినిషర్లలో టిమ్ డేవిడ్ ఒకడని అభివర్ణించారు.

"గత రెండు మూడేళ్లుగా టిమ్ డేవిడ్ పై కన్నేశాం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగ్ ల్లో అతడు ఆడుతున్న తీరును గమనిస్తూనే ఉన్నాం. ఐసీసీ సభ్యదేశాల జట్లపై మెరుగైన ఆటతీరు కనబర్చడమే కాదు, గత సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడి ఐపీఎల్ అనుభవం కూడా సంపాదించాడు. ఆర్సీబీకి ఆడడం ద్వారా ఐపీఎల్ లో ఏ స్థాయిలో ప్రతిభ చూపాల్సి ఉంటుందో అతడు అవగాహన చేసుకుని ఉంటాడని భావిస్తున్నాం.

టిమ్ డేవిడ్ నైపుణ్యాలపై మాకు ఎలాంటి సందేహం లేదు. హార్దిక్ పాండ్యా ఇప్పుడు మా జట్టులో లేకపోవడంతో, అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు భారత్ లో లేరని గుర్తించాం. అందుకే హార్దిక్ స్థానంలో ఓ విదేశీ ఆటగాడ్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకు టిమ్ డేవిడ్ సరిపోతాడని భావించాం" అని అకాశ్ అంబానీ వివరణ ఇచ్చారు.
Akash Ambani
Jofra Archer
Mumbai Indians
Injury
IPL

More Telugu News