జీవితంలో కష్టాలపై టాలీవుడ్ సీనియర్ నటి సుధ స్పందన

23-01-2022 Sun 15:43
  • బాలనటిగా కెరీర్ ప్రారంభించిన సుధ
  • ఆపై పలు చిత్రాల్లో కథానాయికగా అవకాశాలు
  • క్యారెక్టర్ నటిగా గుర్తింపు
  • ప్రస్తుతం చెన్నైలో నివాసం
Tollywood actress Sudha responds on life struggles
తెలుగులో బాలనటిగా ప్రస్థానం ప్రారంభించి, ఆపై తల్లిగా, వదినగా క్యారెక్టర్ రోల్స్ వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సుధ. కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గానూ నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాలను పంచుకుంది. కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత చెన్నైలో ఉంటున్నానని వెల్లడించింది. భర్త, కుమారుడు తన నుంచి వేరుగా అమెరికాలో ఉంటున్నారని తెలిపింది.

ఒకప్పుడు తన తల్లిదండ్రులకు బాగా ఆస్తులు ఉండేవని సుధ చెప్పింది. తన బాల్యంలోనే తల్లిని కోల్పోయానని, తండ్రి కూడా క్యాన్సర్ కారణంగా కన్నుమూశాడని వెల్లడించింది. తల్లిపోయినప్పటి కంటే తండ్రి మరణం తనను చాలా బాధించిందని, జీవితం అంటే ఏంటో అర్థమైందని పేర్కొంది.

"మా నాన్నకు క్యాన్సర్ అని తెలియగానే బంధువులు ఒక్కొక్కరుగా దూరం జరిగారు. ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయింది. 'మాతృదేవోభవ' సినిమాలో జరిగిన సంఘటనలు నా నిజ జీవితంలోనూ జరిగాయి. మా నాన్నకు కొడుకులు ఉన్నా గానీ నేనే చూసుకున్నాను.

ఇప్పుడు నేను చెన్నైలో ఒంటరి జీవితం గడుపుతున్నాను. నా భర్త, కొడుకు అమెరికాలో ఉంటారు. వారికి కూడా నాలాంటి పరిస్థితే ఎప్పుడో ఒకప్పుడు రాకమానదు. ఇవాళ నేను బాధపడేది మా నాన్న కోసమే తప్ప నా భర్త, కొడుకు కోసం మాత్రం కాదు. ఇప్పుడు వాళ్లు సంతోషంగా ఉండొచ్చు కానీ ఏదో ఒకనాడు కష్టాలు అంటే ఏంటో తెలుస్తాయి. ఎన్ని సమస్యలు ఉన్నా నవ్వుతూనే ఉంటాను. నా మనవరాలితో ఆడుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మా అమ్మ పిలిచినట్టే నా మనవరాలు నన్ను "సుధా" అని పేరుపెట్టి పిలుస్తుంది" అని ఆమె వివరించింది.

కాగా, గతంలో ఢిల్లీలో హోటల్ పెట్టి తీవ్రంగా దెబ్బతిన్నానని కూడా ఆమె వెల్లడించింది. ఒక హోటల్ పెట్టినప్పుడు బాగా లాభాలు వచ్చాయని, మరో హోటల్ పెట్టగానే నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందని వివరించింది.