Employees: చర్చలకు రావాలని పిలిచిన ఏపీ మంత్రులు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే వస్తామన్న ఉద్యోగ సంఘాలు

AP employees unions declines ministers call for talks
  • పీఆర్సీపై ప్రతిష్టంభన
  • కొత్త పీఆర్సీ ఒప్పుకోబోమంటున్న ఉద్యోగులు
  • అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం
  • బిల్లులు ప్రాసెస్ చేయబోమన్న పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు
పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు ఏపీ మంత్రులు పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘ నేతలు చర్చలకు రావాలంటూ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఆహ్వానించారు. అయితే, ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

అటు, విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం చేపట్టారు. గాంధీనగర్ లోని ఎన్జీవో కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు హాజరయ్యారు. పీఆర్సీ జీవోలు రద్దు, ఇతర సమస్యలపై చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఉద్యోగ సంఘాలు రేపు రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి.

కాగా, ఉద్యోగుల సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది కూడా పాల్గొంటారని ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో విలీనం చేసినా ఆర్టీసీ సిబ్బంది సమస్యలు తీరలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇస్తారని భావించామని, ప్రభుత్వ ఉద్యోగుల కంటే 19 శాతం ఐఆర్ తేడాగా ఉందని వెల్లడించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు నాలుగేళ్లకోసారి వేతన సవరణ ఉండేదని, పదేళ్లకోసారి వేతన సవరణతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని వివరించారు. ఆర్టీసీ ఉద్యోగుల హెచ్ఆర్ఏ 16 నుంచి 8 శాతానికి తగ్గించారని ఆరోపించారు. విలీనం అయ్యాక ఉద్యోగులు ఎన్నో సౌకర్యాలు కోల్పోయారని తెలిపారు.

ఉద్యోగుల పీఆర్సీ బిల్లులు ప్రాసెస్ చేసే ప్రసక్తే లేదని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల అసోసియేషన్ స్పష్టం చేసింది. పీఆర్సీతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆ సంఘం నేత వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. ఉద్యోగులకు మేలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, అసత్య ప్రచారాన్ని ఉద్యోగులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చినా పీఆర్సీ బిల్లులు ఆమోదించబోమని స్పష్టం చేశారు.
Employees
PRC
Ministers
RTC
Andhra Pradesh

More Telugu News