Masks: ఐదేళ్ల లోపు చిన్నారులకు మాస్క్ అవసరం లేదు: కేంద్ర ప్రభుత్వ కొత్త గైడ్ లైన్స్ లో పలు సూచనలు

  • 6 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలు మాస్కులపై వారికున్న అవగాహనను బట్టి వాటిని వాడవచ్చు
  • 12 ఏళ్లు దాటిన వారు పెద్దల మాదిరి మాస్కులు ధరించవచ్చు
  • స్టెరాయిడ్లు సరైన సమయంలో, సరైన మోతాదులో ఇవ్వాలి
Childres below 5 years no need to wear mask Center says in its new Covid guidelines

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చిన్న పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్ల లోపు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు.

అలాగే, 6 నుంచి 11 ఏళ్ల వయసున్న పిల్లలు... మాస్కులను ధరించడంపై వారికున్న అవగాహనను బట్టి ధరించవచ్చు. ఈ వయసు పిల్లలు మాస్కులను ఎలా ధరిస్తున్నారు, ఎలాంటి మాస్కులను ధరిస్తున్నారు, మాస్కులు పరిశుభ్రంగా ఉన్నాయా తదితర అంశాలను వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. 12 ఏళ్లు వయసు దాటిన పిల్లలు పెద్దల మాదిరే మాస్కులు ధరించవచ్చు.

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయనే అంచనాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఒక నిపుణుల కమిటీ తాజా మార్గదర్శకాలను రూపొందించింది. విదేశాల నుంచి వచ్చిన డేటాను విశ్లేషించిన తర్వాత ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉందని తేలిందని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే మూడో వేవ్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని చాలా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రస్తుత కేసులను పరిశీలిస్తే అసింప్టొమేటిక్ (లక్షణాలు లేకపోవడం), తక్కువ లక్షణాలు, ఓ మాదిరి లక్షణాలు, తీవ్ర లక్షణాలుగా నాలుగు కేటగిరీలు ఉన్నాయి.

లక్షణాలు లేకపోవడం, తక్కువ లక్షణాలు ఉన్న కేసులలో చికిత్స కోసం యాంటీమైక్రోబియల్స్ థెరపీని సిఫారసు చేయడం లేదని కేంద్రం తెలిపింది. ఓ మాదిరి లేదా తీవ్ర లక్షణాలు ఉన్నవారికి... వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉందనే అనుమానం ఉంటే తప్ప యాంటీమైక్రోబియల్స్ ఇవ్వకూడదని చెప్పింది. చికిత్సలో స్టెరాయిడ్లను సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన వ్యవధిలో వాడాలని తెలిపింది. తొలి మూడు నుంచి ఐదు రోజుల వరకు స్టెరాయిడ్స్ వాడవద్దని పేర్కొంది.

ఆసుపత్రిలో ఉన్న సమయంలో పిల్లలకు ఏదైనా శరీర భాగానికి ఇబ్బంది తలెత్తితే... తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలని సూచించింది. తాజా మార్గదర్శకాలను మరింత సమీక్షిస్తామని, కొత్త లక్షణాలు, అందుబాటులో ఉన్న చికిత్స ఆధారంగా మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది.

More Telugu News