Nagarjuna: టికెట్ ధరల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: నాగార్జున

I dont have any issue with tickets price says Nagarjuna
  • టికెట్ ధర ఎక్కువుంటే ఎక్కువ డబ్బులొస్తాయి
  • రేటు తక్కువుంటే తక్కువ డబ్బులొస్తాయి
  • ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను జేబులో పెట్టుకుని ఉండలేం
ఓవైపు ఏపీలో తగ్గిన టికెట్ ధరలు, మరోవైపు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు టాలీవుడ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీల విడుదల వాయిదా పడింది. తాజాగా నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి నటించిన 'బంగార్రాజు' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా విడుదల తేదీని ఖరారు చేసేందుకు చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం నాలుగేళ్లుగా ఎంత కష్టపడిందో తనకు తెలుసని... 'రాధేశ్యామ్' సినిమా బృందం కూడా ఎన్నో ఏళ్లుగా శ్రమించిందని... ఈ సినిమాల విడుదల వాయిదా పడటం బాధను కలిగిస్తోందని నాగార్జున అన్నారు. ఇవి పాన్ ఇండియా చిత్రాలు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల కాకపోవడమే మంచిదని చెప్పారు. తమ సినిమాను మాత్రం విడుదల చేస్తున్నామని అన్నారు.

ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని... టికెట్ ధర ఎక్కువగా ఉంటే తమకు ఎక్కువ డబ్బులొస్తాయని, ధర తక్కువుంటే తమకు తక్కువ డబ్బులొస్తాయి అంతేనని నాగార్జున చెప్పారు. తమ సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి బాగోలేకపోయినా... సినిమాను జేబులో పెట్టుకుని ఉండలేమని చెప్పారు. అందుకే వసూళ్లు తక్కువగా వస్తాయని తెలిసినా సినిమాను విడుదల చేస్తున్నామని అన్నారు. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం వల్ల తమ సినిమాకు ఎంత లాభమనేది ఇప్పుడే చెప్పలేమని... సినిమా విడుదల తర్వాత తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
Nagarjuna
Bangarraju Movie
rrr
Radhe Shyam
Tollywood
Release

More Telugu News