Bandi Sanjay: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు: జైలు నుంచి విడుదలైన తర్వాత కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్

KCR we will never leave you warns Bandi Sanjay
  • నన్ను అరెస్ట్ చేయించి కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారు
  • ఉద్యోగుల కోసం మరోసారి జైలుకు వెళ్లేందుకు సిద్ధం
  • వేల కోట్లు దోచుకుని కేసీఆర్ అవినీతి కుబేరుడిగా మారారు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర సహాయ మంత్రి భగవంత్ కుభాతో కలిసి ఆయన జైలు ప్రాంగణం నుంచి బయటకు వచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జీవో 317కి సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన జాగరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు.

జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ నీ గొయ్యి నీవే తవ్వుకుంటున్నావ్ అని ఆయన అన్నారు. తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదని... వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరుడిగా మారాడని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటే... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు.

317 జీవోను సవరించాలని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని సంజయ్ చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసమే తాను జైలుకు వెళ్లానని... అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే దీక్షను భగ్నం చేశారని మండిపడ్డారు. తమ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని, కార్యకర్తలపై దాడి చేశారని చెప్పారు. తనను అరెస్ట్ చేసి కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. హక్కుల కోసం పోరాడే వారికి బీజేపీ అండగా ఉంటుందని... వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.
Bandi Sanjay
bjp
KCR
TRS
Jail
Release

More Telugu News