womens: మహిళల వివాహ వయసు పెంపు బిల్లుపై సమీక్షకు కేంద్రం రెడీ

womens marriage age
  • ఈ వారంలో పార్లమెంటు ముందుకు బిల్లు
  • ప్రతిపక్షాలు కోరితే స్టాండింగ్ కమిటీకి పంపే యోచన
  • హడావిడిగా కాకుండా, అందరి సమ్మతితో వెళ్లే భావన
మహిళల కనీస వివాహ వయోపరిమితిని కేంద్ర సర్కారు 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయించగా.. ఈ అంశంలో ఏకపక్షంగా ముందుకు వెళ్లకూడదనే భావనలో ఉంది. ప్రతిపక్షాలు కోరితే బిల్లును పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపేందుకు సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు మహిళలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లుగా చట్టబద్ధమైన పరిమితి ఉంది. పురుషులతో మహిళలు అన్నింటా సమానమైనప్పుడు వివాహ వయసు విషయంలో వివక్ష ఏమిటంటూ విమర్శలు ఉన్నాయి. తక్కువ వయసు పరిమితివల్ల ఉన్నత విద్యకు వారు దూరం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయంటూ, వయోపరిమితి పెంచాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. పురుషుల విషయంలో ఈ విధమైన అభ్యంతరాలు, డిమాండ్లు ఏవీ లేవు.

దీంతో మహిళల వివాహ కనీస వయో పరిమితిని పురుషులతో సమానంగా 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గత వారం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ వారంలోనే పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు 23వ తేదీతో ముగియనుండడం గమనార్హం. అయితే, కీలకమైన ఈ బిల్లుపై హడావిడిగా ముందుకు వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొన్ని విపక్షాలు, సమాజంలోని కొన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నందున అవసరమైతే మరింత పరిశీలన, సమీక్ష కోసం స్టాండింగ్ కమిటీకి నివేదించేందుకు అంగీకరించే యోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిపాయి.
womens
marriage
central governament
bill
parliament

More Telugu News