Rahul Gandhi: ఆ మంత్రి పెద్ద నేరస్థుడు.. లఖింపూర్ ఖేరి ఘటనపై రాహుల్ మండిపాటు

Rahul Gandhi Says Minister A Criminal On Lakhimpur Kheri
  • దద్దరిల్లిన లోక్ సభ
  • మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
  • కచ్చితంగా లఖింపూర్ ఘటన కుట్రేనన్న రాహుల్

లఖింపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ నేరస్థుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ సమావేశాల్లో లఖింపూర్ ఖేరి ఘటనపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుట్ర ప్రకారం చేసిన దాడి అంటూ సిట్ అధికారులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల అరుపులతో సభ మొత్తం దద్దరిల్లింది. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

అనంతరం పార్లమెంట్ ఆవరణలో రాహుల్ మీడియాతోనూ మాట్లాడారు. లఖింపూర్ ఖేరి ఘటన ఓ కుట్రంటూ నివేదిక ఇచ్చారని, కచ్చితంగా అది కుట్రేనని ఆయన అన్నారు. ఎవరి కుమారుడికి ఆ ఘటనలో హస్తం ఉందో అందరికీ తెలుసన్నారు. 'దానిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందే. కానీ, అందుకు ప్రధాని ఒప్పుకోవడం లేదు. మంత్రిని వెనకేసుకొస్తున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది అక్టోబర్ లో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో రైతులపైకి మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ లోని ఓ కారు ఎక్కించడంతో నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన సమయంలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సదరు కారులో ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత రైతులు చేసిన దాడిలో మరో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News