పని చేయకుండా దగ్గరకొచ్చి కబుర్లు చెప్పే వారిని ఉపేక్షించను: చంద్రబాబు హెచ్చరిక

09-12-2021 Thu 06:59
  • కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తా
  • అందరి జాతకాలు నా వద్ద ఉన్నాయి
  • ఏడు చోట్ల 350 ఓట్ల తేడాతో ఓడిపోయాం
  • కుప్పం నేతలతో సమావేశంలో చంద్రబాబు
Chandrababu warns party leaders who not work for party
పని చేయకుండా కబుర్లు చెప్పే వారిని ఇకపై ఉపేక్షించబోనని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఆరు నెలలపాటు కుప్పంపైనే దృష్టిసారించనున్నట్టు స్పష్టం చేశారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ నాయకులతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నిన్న సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని పూర్తిగా ప్రక్షాళించాల్సిన అవసరం ఉందని, కుప్పం నుంచే ఆ పనిని ప్రారంభిస్తానని పేర్కొన్నారు. పార్టీని ఇక్కడ సమర్థంగా నడిపించేందుకు సమన్వయ కమిటీని నియమిస్తానని తెలిపారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఏడు వార్డుల్లో టీడీపీ 350 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

ఈ సందర్భంగా ఓ కార్యకర్త మాట్లాడుతూ.. పార్టీ నాయకులు కొందరు అమ్ముడుపోయారని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయన్నారు. అధికార పార్టీ ఆగడాల వల్లే స్థానిక నేతలు భయపడుతున్నట్టు సమాచారం ఉందన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.