Team India: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ నియామకాన్ని నూతన శకంగా అభివర్ణించిన ఐసీసీ.. ఎవరెవరు ఏమన్నారంటే..?

ICC Responds about Rohit sharma appointment as one day captain
  • దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టు ప్రకటన
  • కోహ్లీని పక్కనపెట్టి రోహిత్‌కు ప్రమోషన్
  • చాలా మంచి నిర్ణయమన్న మైఖేల్ వాన్
  • ద్రావిడ్‌కు కొంచెం క్లిష్టంగానే ఉంటుందన్న హర్షాభోగ్లే
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించడంపై ఐసీసీ సహా పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు. త్వరలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

గత కొంతకాలంగా అంతగా రాణించలేకపోతున్న విరాట్ కోహ్లీ నుంచి వన్డే జట్టు పగ్గాలు తీసుకుని రోహిత్ శర్మకు అందించారు. అయితే టెస్టులకు మాత్రం కోహ్లీనే కొనసాగిస్తున్నారు. అలాగే, టెస్టుల్లో రహానే బదులుగా రోహిత్‌కు వైఎస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కాగా, రోహిత్‌కు ఇప్పటికే టీ20 పగ్గాలు కూడా అప్పగించడంతో ఇక కోహ్లీ ఒక్క టెస్టులకు మాత్రమే సారథ్యం వహిస్తాడు.

ఇక వన్డే జట్టు కెప్టెన్‌గా కోహ్లీని తప్పిస్తూ రోహిత్‌కు పగ్గాలు అప్పగించడంపై ఐసీసీ సహా పలువురు మాజీ ఆటగాళ్లు, క్రీడా విశ్లేషకులు స్పందించారు. భారత పురుషుల వన్డే క్రికెట్‌లో ఇది నూతన శకమని ఐసీసీ అభివర్ణించింది. ఇది చాలా మంచి నిర్ణయమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’ను నడిపించేందుకు నంబర్ 45 (రోహిత్ శర్మ జెర్సీ నంబరు) సిద్ధమని ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ పేర్కొంది.

క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే మాట్లాడుతూ.. కోహ్లీ, రోహిత్‌లతో కూడిన జట్లను ద్రావిడ్ ఎలా నడిపిస్తాడో చూడాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నారని, ఇద్దరు కెప్టెన్లతో ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుందని పేర్కొన్నాడు. కోచ్ ద్రావిడ్‌కు మాత్రం ఇది కొంచెం క్లిష్టంగానే ఉంటుందని పేర్కొన్నాడు.

క్రీడా విశ్లేషకుడు అయాజ్ మీనన్ మాట్లాడుతూ.. రెండు వేర్వేరు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమించడం వల్ల డ్రెస్సింగ్ రూములో మార్పులు తప్పవని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లీని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంలో ద్రావిడ్ పెద్దన్న పాత్ర పోషించాలని అన్నాడు.
Team India
Virat Kohli
Rohit Sharma
South Africa
BCCI

More Telugu News