Uttar Pradesh: తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడని కక్ష.. సహోద్యోగి తల నరికి రాత్రంతా పక్కనే పడుకున్న కిరాతకుడు!

Man Beheads Colleague in Uttar Pradesh
  • ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘటన
  • పార్టీ ఇస్తానని చెప్పి ఘాతుకం
  • తల వేరు చేసి చెత్తకుప్పలో విసిరేసిన వైనం
తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడన్న కక్షతో సహోద్యోగి తల నరికాడో కిరాతకుడు. ఆపై రాత్రంతా మొండెం పక్కనే నిద్రపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. సందీప్ మిశ్రా అనే వ్యక్తి ఓ కంపెనీలో మెషీన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ప్రమోద్ కుమార్ సీనియర్‌ ఉద్యోగిగా ఉన్నాడు. ఈ క్రమంలో సందీప్ పనితీరుపై ప్రమోద్ కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

తనపై ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన సందీప్ మిశ్రా.. ప్రమోద్ కుమార్‌పై కక్ష పెంచుకున్నాడు. దీంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆదివారం రాత్రి పార్టీకి ఆహ్వానించి పూటుగా తాగించాడు. సందీప్ మత్తులోకి జారుకున్న వెంటనే కత్తితో అతడి తలను తెగనరికాడు. అనంతరం అక్కడే నిద్రపోయాడు. ఉదయం లేచి తలను ప్లాస్టిక్ సంచిలో చుట్టి బయటకు తీసుకొచ్చి చెత్తకుప్పలో విసిరేశాడు.

మరోవైపు, అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలోని కాస్‌గంజ్‌‌లో ఉంటున్న సందీప్ భార్య మీరాదేవి భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వెతుక్కుంటూ  సందీప్ ఇంటికి వచ్చింది. ఇంటి బయట రక్తపు మరకలు ఉండడంతో అనుమానించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సందీప్ ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపు బద్దలుగొట్టి చూడగా లోపల ప్రదీప్ తలలేని మృతదేహం కనిపించింది. ఆ తర్వాత అక్కడికి 500 మీటర్ల దూరంలోని చెత్తకుప్ప నుంచి తలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి సమీపంలో తచ్చాడుతున్న సందీప్‌ను పట్టుకుని అరెస్ట్ చేశారు.
Uttar Pradesh
Murder
Crime News

More Telugu News