East Godavari District: తన మాట వినకుంటే చీరేస్తానంటూ ఎంపీడీవోను బెదిరించిన వైసీపీ నేత తాతాజీ అరెస్ట్

nallacheruvu ycp leader tataji arested for warning mpdo
  • ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి బెదిరించిన నల్లచెరువు మాజీ సర్పంచ్
  • అసభ్య పదజాలంతో దూషణ
  • అమలాపురం పోలీస్ స్టేషన్‌లో ఎంపీడీవో విజయ ఫిర్యాదు
  • అట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు
తన మాట వినకుంటే చీరేస్తానంటూ ఎంపీడీవోను హెచ్చరిస్తూ దుర్భాషలాడిన తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు మాజీ సర్పంచ్, వైసీపీ నేత వాసంశెట్టి తాతాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన తాతాజీ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు.

వెళ్తూవెళ్తూనే  ఎంపీడీవో కేఆర్ విజయపై విరుచుకుపడ్డారు. తమ మాట వినడం లేదని, మాట వినకుంటే చీరేస్తామని హెచ్చరించడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్యాలయ సూపరింటెండెంట్ దీక్షితులు వారిస్తున్నా వెనక్కి తగ్గలేదు సరికదా, అసభ్య పదజాలంతో దూషించారు. తాను ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకుంటే ఎక్కడికైనా పంపించి వేయాలని ఎంపీడీవో చెబుతున్నా తాతాజీ వినిపించుకోలేదు. అనంతరం అమలాపురం ఆర్డీవో వసంతరాయుడికి ఫిర్యాదు చేసిన విజయ తనకు రక్షణ కల్పించాలని కోరారు.

అలాగే, అమలాపురం పోలీస్ స్టేషన్‌లో విజయ ఫిర్యాదు చేశారు. తాతాజీ, అయినవిల్లి జడ్పీటీసీ సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, కె.జగన్నాథపురం సర్పంచ్ భర్త మేడిశెట్టి శ్రీనివాస్, శంకరాయగూడెం మాజీ సర్పంచ్ కుడిపూడి రామకృష్ణ తనను చీరేస్తానని బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎంపీడీవో విజయ ఫిర్యాదుతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి అభియోగాలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. తాతాజీని అరెస్ట్ చేశామని, మిగతా ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, ఎంపీడీవోపై బెదిరింపులకు నిరసగా జిల్లాలోని పలుచోట్ల ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
East Godavari District
Amalapuram
Nallacheruvu
MPDO
YSRCP

More Telugu News