బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకున్న అధికారులు

05-12-2021 Sun 21:59
  • రూ.200 కోట్ల మనీలాండరింగ్ వ్యవహారంలో జాక్వెలిన్ పేరు
  • ఈడీ సమన్లు
  • జాక్వెలిన్ ను విచారించిన అధికారులు
  • లుకౌట్ నోటీసులు జారీ
Mumbai airport officials stops Jacqueline Fernandez
బాలీవుడ్ నటి, శ్రీలంక అందాలభామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ముంబయి ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమెపై ఈడీ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేయడమే అందుకు కారణం. దాంతో దేశం విడిచి వెళ్లకుండా ఆమెను నిలువరించారు.

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. విచారణ సమయంలో సుఖేశ్ జాక్వెలిన్ పేరు కూడా వెల్లడించినట్టు తెలిసింది. ఆమెకు సుఖేశ్ ఎంతో ఖరీదైన కానుకలు ఇచ్చిన విషయం కూడా బయటికి వచ్చింది. వాటిలో రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గుర్రం, రూ.9 లక్షల విలువ చేసే పిల్లి కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాక్వెలిన్ కు సమన్లు జారీ చేసింది. ఈడీ విచారణకు హాజరైన జాక్వెలిన్ పై కొన్నాళ్ల కిందట లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చిన జాక్వెలిన్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెను అడ్డుకున్న సిబ్బంది లుకౌట్ నోటీసులు విషయం వివరించి ఆమెను తిప్పి పంపారు. ఇటీవల కాలంలో ఆమె పలు పర్యాయాలు ఈడీ విచారణకు గైర్హాజరైనట్టు తెలుస్తోంది.