Scotty Thomas: ఇది మహా అదృష్టం... రెండు లాటరీ టికెట్లు కొంటే రెండింటికీ జాక్ పాట్

US citizen gets two jackpots after her bought two lottery tickets
  • అమెరికాలో ఓ వ్యక్తికి డబుల్ జాక్ పాట్
  • ఆన్ లైన్ లో లాటరీ టికెట్లు కొన్న నార్త్ కరోలినా వాసి
  • రెండు టికెట్లకు లైఫ్ టైమ్ జాక్ పాట్
  • ఏటా 50 వేల డాలర్లు పొందే అవకాశం
ఒక లాటరీ తగలడమే గొప్ప అదృష్టం అనుకుంటే, అమెరికాలో ఓ వ్యక్తికి డబుల్ ధమాకా తగిలింది. నార్త్ కరోలినాకు చెందిన 49 ఏళ్ల స్కాటీ థామస్ రెండు లాటరీ టికెట్లు కొంటే రెండింటికి జాక్ పాట్ తగిలింది. ఆ రెండు లాటరీ టికెట్లు కొనడం వెనుక కూడా ఎంతో ఆశ్చర్యకరమైన కథ ఉంది.

స్కాటీ థామస్ ఓ డంపింగ్ ట్రక్కు ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. మొదట ఆన్ లైన్ లో ఒక టికెట్ కొనుగోలు చేశాడు. అయితే, ఆ టికెట్ కు సంబంధించి ఆన్ లైన్ లో అన్ని వివరాలు పొందుపరిచానో లేదో అనే సందేహం కలిగింది. దాంతో ఆన్ లైన్ లో తన వివరాలతో మరో ఫారం నింపాడు. ఆ విధంగా రెండు టికెట్లు కొన్నట్టయింది.

అతడికి మహా అదృష్టం పట్టిందేమో... ఆ రెండు టికెట్లకు లైఫ్ టైమ్ జాక్ పాట్ ప్రైజు వచ్చింది. దాని ప్రకారం ప్రతి టికెట్ మీద ప్రతి ఏడాదికి 25 వేల డాలర్లు లభిస్తాయి. ఆ విధంగా రెండు టికెట్ల మీద జీవితాంతం ప్రతి ఏడాది 50 వేల డాలర్లు స్కాటీ థామస్ సొంతం అవుతాయి. కాగా, ఇంతటి బంపర్ ప్రైజు తనకు లభించిందన్న వార్త వినగానే నమ్మలేకపోయానని, ఆనందంతో కిందపడి దొర్లానని థామస్ వెల్లడించాడు.

అయితే, జీవితాంతం డబ్బు తీసుకునే బదులు ఒకేసారి 7,80,000 డాలర్లు కోరుకున్నాడు. సదరు లాటరీలో ఈ విధమైన సదుపాయం కూడా ఉంది. వ్యాపారం చేయడానికి, కుటుంబ అప్పులు తీర్చడానికి, ఓ ఇల్లు కొనడానికి ఆ సొమ్ము ఖర్చు చేస్తానని వెల్లడించాడు. కాగా పన్నులన్నీ మినహాయించుకుంటే అతడికి 5,51,851 డాలర్లు లభిస్తాయని లాటరీ నిర్వాహకులు తెలిపారు.
Scotty Thomas
Jackpot
Lottery
North Corolina
USA

More Telugu News