Omicron: రాజస్థాన్ లో ఒకే కుటుంబంలో 9 మందికి ఒమిక్రాన్ పాజిటివ్
- భారత్ లో ఒమిక్రాన్ కలకలం
- వేగంగా పెరుగుతున్న కేసులు
- జైపూర్ లో ఒమిక్రాన్ కేసులు వెల్లడి
- ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబం
- భారత్ లో 21కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలకలం రేపుతోంది. తాజాగా రాజస్థాన్ లోని ఒకే కుటుంబంలో 9 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఒకేసారి ఇన్ని కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
జైపూర్ ఆదర్శ్ నగర్ లోని ఓ కుటుంబంలోని వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 9 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వారందరూ కొన్నిరోజుల కిందట దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చారు. కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో, రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న ప్రాంతంలో కర్ఫ్యూ విధించింది.
భారత్ లో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి పెరిగింది. ఇంతకుముందే మహారాష్ట్రలోని పూణేలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం తెలిసిందే.