వీళ్ల దుంపతెగ... ఏకంగా యుద్ధ విమానం టైరును ఎత్తుకెళ్లారు!

05-12-2021 Sun 15:04
  • లక్నో ఎయిర్ బేస్ వద్ద ఘటన
  • ఐదు టైర్లను జోధ్ పూర్ తరలించాలని భావించిన అధికారులు
  • వాటిలో ఒకటి కనిపించకుండా పోయిన వైనం
  • పోలీసులకు ఫిర్యాదు
Fighter Jet tyre missing at Lucnow air base
లక్నోలోని భారత వాయుసేన స్థావరంలో విస్మయం కలిగించే సంఘటన జరిగింది. ఏకంగా యుద్ధ విమానం టైరును అపహరించారు. ఇటీవల వాయుసేన అధికారులు 5 టైర్లను రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఎయిర్ బేస్ కు తరలించాలని నిర్ణయించారు. వాటిని ఓ ట్రక్కులో ఉంచారు. అందులో ఒక టైరు కనిపించకుండా పోవడంతో ట్రక్కు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఈ నెల 3న దీప్ రాజ్, హిమాంశు బన్సల్ అనే వ్యక్తులు ఆ విమానం టైరును వాయుసేన అధికారులకు అప్పగించారు. గత నెలలో ఓ సర్వీసు రోడ్డు వద్ద ఆ టైరును గుర్తించామని, లారీ టైరు అనుకుని తీసుకెళ్లామని వారు వివరించారు. యుద్ధ విమానం టైరు కనిపించడంలేదని మీడియాలో చూసి ఆ టైరును తిరిగి ఇచ్చేసినట్టు వారిద్దరూ వెల్లడించారు. దాంతో విమానం టైరు కథ సుఖాంతమైంది. ఇంతకీ ఆ టైరును దొంగిలించింది ఎవరన్నది ఇంకా తేలలేదు.