ఆకాశంలో మిస్టరీ కాంతులు... పంజాబ్ లో అంతుచిక్కని ఘటన

03-12-2021 Fri 21:48
  • పఠాన్ కోట్ వద్ద ఆకాశంలో కనిపించిన లైట్లు
  • ఓ వరుసలో ఉన్న లైట్లు
  • దాదాపు 5 నిమిషాల పాటు దర్శనం
  • మిస్టరీగా మారిన వైనం
Mystery lights spotted in Pathankot sky
పంజాబ్ లో అంతుచిక్కని ఘటన చోటుచేసుకుంది. పఠాన్ కోట్ లో ఈ సాయంత్రం చీకట్లు కమ్మే సమయంలో ఆకాశంలో వింత కాంతులు దర్శనమిచ్చాయి. ఆ లైట్లు ఏమిటో అర్థం కాక ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. ఆకాశంలో ఓ వరుసలో కనిపించిన లైట్లు ఏమిటో అటు అధికారులకు కూడా అంతుబట్టలేదు. సాయంత్రం 6.50 నిమిషాలకు ఈ లైట్లు కనిపించాయి. దాదాపు 5 నిమిషాల పాటు కనిపించాయని స్థానికులు వెల్లడించారు.

ఇదే తరహాలో ఈ ఏడాది జూన్ లో గుజరాత్ లోని జునాగఢ్ లోనూ వినువీధిలో మిస్టరీ లైట్లు కనిపించాయి. అవి గ్రహాంతరజీవుల వాహనాలుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారు నరోత్తమ్ సాహూ ఆ ప్రచారంపై స్పందిస్తూ... కొన్ని ఉపగ్రహాలు అత్యంత తక్కువ ఎత్తులో భూకక్ష్యలో పరిభ్రమిస్తున్నప్పుడు ఆ విధంగా కనిపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

తాజాగా, పంజాబ్ లోని పఠాన్ కోట్ లో కనిపించిన లైట్ల అంశం మాత్రం మిస్టరీగా మారింది.