CM Jagan: ఉత్తరాంధ్రపై జవాద్ తుపాను ప్రభావం... కలెక్లర్లతో సీఎం జగన్ సమీక్ష

CM Jagan reviews Cyclone Jawad situation
  • బంగాళాఖాతంలో జవాద్ తుపాను
  • రేపు ఉత్తరాంధ్ర తీరానికి చేరువగా రాక
  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై ప్రభావం
  • అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం
ఉత్తరాంధ్ర తీరం దిశగా జవాద్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో జవాద్ తుపాను ప్రభావం, సన్నద్ధతపై చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా హాజరయ్యారు.

ఈ సమావేశం సందర్భంగా సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుపాను కారణంగా ఎలాంటి మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాను ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

సహాయ చర్యల్లో ఏ లోపం ఉండరాదని పేర్కొన్నారు. ముఖ్యంగా, సహాయ శిబిరాల్లో ఆహార నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. మంచినీరు, పరిశుభ్రమైన టాయిలెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆయా జిల్లాల్లో అవసరం మేరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను అందుబాటులో ఉంచాలని, అదనపు బృందాలను కూడా సిద్ధం చేయాలని సూచించారు. ముంపు ప్రాంతాలను ముందే గుర్తించి, అక్కడి ప్రజలను తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు.

భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున చెరువులు, రిజర్వాయర్లు, కాలువ కట్టల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడైనా గండ్లు పడినట్టు గుర్తిస్తే వెంటనే జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని నిర్దేశించారు.

ఉభయగోదావరి జిల్లాలకు నేరుగా తుపాను ముప్పు లేనప్పటికీ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ఉదాసీనంగా ఉండరాదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
CM Jagan
Cyclone Jawad
Review
North Andhra

More Telugu News