బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేస్తే రూ. కోటి ఇస్తానన్న కర్ణాటక కాంగ్రెస్ నేత.. కలకలం రేపుతున్న వీడియో

02-12-2021 Thu 06:55
  • బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్‌ను హత్య చేయాలని బేరం
  • విషయం మన ఇద్దరి మధ్యే ఉంటుందన్న కాంగ్రెస్ నేత
  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
Congress leader caught on camera planning murder of karnataka BJP MLA
బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ఓ వ్యక్తితో బేరం కుదుర్చుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నాయకుడైన గోపాలకృష్ణ ఓ వ్యక్తితో మాట్లాడుతున్న ఈ వీడియోలో యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్‌ను హత్య చేయాలని చెబుతుండడం స్పష్టంగా వినిపిస్తోంది.

‘‘ఆ బీజేపీ ఎమ్మెల్యే (విశ్వనాథ్)ను ఫినిష్ చేస్తే కోటి రూపాయలు ఇస్తాను. ఈ విషయం మనిద్దరి మధ్యే ఉంటుంది ఎవరికీ తెలియదు’’ అని ఆ వ్యక్తికి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ వీడియో ఎప్పటిది, ఈ ఘటన ఎప్పుడు జరిగింది అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

ఈ విషయంపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. విశ్వనాథ్ తనతో మాట్లాడినట్టు చెప్పారు.  మంగళవారం రాత్రే ఈ వీడియో గురించి తనకు తెలిసిందని అన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. ఎమ్మెల్యేకు భద్రత కల్పించే అంశంపై పరిశీలిస్తున్నట్టు చెప్పారు.