Omicron: పెద్ద ఎత్తున నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు.. 20 దేశాలకు వ్యాప్తి

Corona New Variant Omicron presence in 20 countries
  • అక్టోబరులోనే బయపడిన కొత్త వేరియంట్
  • ఈయూలోని 11 దేశాల్లో 44 కేసులు
  • నైజీరియాలో తొలి కేసు
  • ఎట్-రిస్క్ దేశాల నుంచి నిన్న 3,476  మంది భారత్‌కు
  • ఆరుగిరికి కరోనాగా నిర్ధారణ
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఇదేదో ఇప్పుడే బయటపడినది కాదని, దక్షిణాఫ్రికాలో వెలుగు చూడడానికి ముందే అక్టోబరులోనే ఇది వెలుగుచూసిందని, ఈ క్రమంలో పలు దేశాలకు పాకిపోయిందని చెబుతున్నారు. అయితే, దీని తీవ్రతపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. యూరోపియన్ యూనియన్‌లోని 11 దేశాల్లో ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కావడం ఇందుకు ఊతమిస్తోంది. బాధితుల్లో చాలామంది ఆఫ్రికా దేశాలకు వెళ్లివచ్చినవారేనని తేలింది.

ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 20 దేశాలకు పాకిపోయింది. కొత్త వేరియంట్ గురించి ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా అప్రమత్తం చేయడానికి ముందే అంటే అక్టోబరులోనే అక్కడి నుంచి వచ్చిన వారికి నైజీరియా పరీక్షలు చేసి నమూనాలు సేకరించింది. తాజాగా ఆ నమూనాలను పరీక్షించగా ఒకరికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయిందని నైజీరియా జాతీయ ప్రజారోగ్య సంస్థ నిన్న తెలిపింది.

అలాగే, సౌదీ అరేబియాలోనూ ఓ కేసు నమోదైంది. మరోవైపు, దక్షిణాఫ్రికా తదితర ఎట్-రిస్క్ దేశాల నుంచి నిన్న 3,476 మంది భారత్ చేరుకున్నారు. వీరిలో ఆరుగురికి కరోనా సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో వారికి సోకింది ఒమిక్రానా? కాదా? అన్నది నిర్ధారించుకునేందుకు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగుకు పంపినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Omicron
Corona Virus
South Africa
Nigeria
India

More Telugu News