వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని అయ్యప్ప సాక్షిగా కోరుకుంటున్నా: చిరంజీవి

17-11-2021 Wed 20:11
  • యోధ లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు
  • కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, తలసాని
  • వెంకయ్యనాయుడు సమాజానికి చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవన్న చిరంజీవి
I want Venkaiah Naidu to become President of India says Chiranjeevi
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమాజానికి చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని సినీ నటుడు చిరంజీవి కొనియాడారు. వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అయ్యప్ప సాక్షిగా ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

హైదరాబాదులోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ ను ఈరోజు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో ఏళ్లుగా తన సొంత వనరులతో ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నానని చెప్పారు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న పేద కళాకారులకు లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ లో పరీక్షలు చేయించుకునే వెసులుబాటును కల్పించాలని కోరారు.