ఈ వీడియో చూస్తే మీరూ 'నాటు' స్టెప్పులు వేయొచ్చు!

17-11-2021 Wed 19:12
  • రాజమౌళి నుంచి రానున్న 'ఆర్ ఆర్ ఆర్
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • 'నాటు' డాన్స్ కి విపరీతమైన క్రేజ్
  • ప్రేమ్ రక్షిత్ నుంచి వీడియో  
RRR movie update
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధాన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా కోసం ఆయన ఒక మాస్ బీట్ ను కంపోజ్ చేసి వదిలారు. 'నాటు నాటు' అంటూ సాగే ఈ పాటకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.

ఎన్టీఆర్ .. చరణ్ పై ఈ పాటను చిత్రీకరించారు. చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చిన ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ మంచి డాన్సర్లే .. వాళ్లిద్దరి టాలెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ కి అంతా ఫిదా అవుతున్నారు. చాలామంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

దాంతో ఈ సాంగ్ కి డాన్స్ చేయాలనుకునేవారి కోసం డాన్స్ మాస్టర్  ప్రేమ్ రక్షిత్ ఒక వీడియో చేసి షేర్ చేశాడు. ఈ వీడియో చూస్తూ స్టెప్స్ ను ప్రాక్టీస్ చేయవచ్చన్నమాట. రిహార్సల్స్ తరహాలో ప్రేమ్ రక్షిత్ చేసిన ఈ వీడియోతో, ఇక సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రీల్స్ కనిపించడం ఖాయమనిపిస్తోంది.