AP High Court: రాజధాని రైతుల 'మహా పాదయాత్ర'కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

High Court gives nod to farmers Maha Padayatra
  • నవంబరు 1 నుంచి రైతుల పాదయాత్ర
  • అనుమతి ఇవ్వలేమన్న డీజీపీ గౌతమ్ సవాంగ్
  • హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన రైతులు
  • నేడు తీర్పు వెల్లడించిన న్యాయస్థానం
అమరావతి ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో రాజధాని రైతులు 'మహా పాదయాత్ర' చేపట్టడం తెలిసిందే. తాజాగా ఈ పాదయాత్రకు ఏపీ హైకోర్టు పచ్చజెండా ఊపింది. రైతులు పాదయాత్ర చేసుకోవచ్చని స్పష్టం చేసింది. రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అమరావతి పరిరక్షణ సమితికి లేఖ ద్వారా తెలియజేయగా, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను కోర్టు నేడు విచారించింది.

వాదనల సందర్భంగా... రైతులు గ్రామాల్లోకి వెళితే వారిపై రాళ్లు విసిరే ప్రమాదం ఉందని, రైతుల పాదయాత్రతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రైతుల తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ స్పందిస్తూ, రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. అనుమతి ఇవ్వలేమంటూ డీజీపీ పంపిన లేఖలో సరైన కారణాలు లేవని కోర్టుకు నివేదించారు.

ఈ నేపథ్యంలో కోర్టు... రైతులు పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి, పోలీసులకు ఏమిటి అభ్యంతరం? అని ప్రశ్నించింది. ఈ క్రమంలో రైతుల పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. హైకోర్టు తీర్పుతో అమరావతి వర్గాలు సంతోషం వెలిబుచ్చాయి.

'న్యాయస్థానం టు దేవస్థానం' పేరుతో నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి నుంచి తిరుమల వరకు ఈ యాత్ర సాగనుంది.
AP High Court
Maha Padayatra
Farmers
Amaravati
AP Capital
Andhra Pradesh

More Telugu News