టీ20 వరల్డ్ కప్: ఎదురులేని శ్రీలంక... నెదర్లాండ్స్ పై సాధికారిక విజయం

22-10-2021 Fri 21:48
  • గ్రూప్-ఏలో లంకకు అగ్రస్థానం
  • ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయం
  • నేటి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై 8 వికెట్లతో విక్టరీ
  • అన్ని రంగాల్లో సత్తా చాటిన లంకేయులు
  • నేటితో ముగిసిన తొలి దశ పోటీలు
  • రేపటి నుంచి సూపర్-12 దశ
Sri Lanka beat Nederlands
టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక అజేయ ప్రస్థానం కొనసాగుతోంది. ఇప్పటికే సూపర్-12 దశకు చేరుకున్న శ్రీలంక నేడు జరిగిన గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై అన్ని రంగాల్లో సత్తా చాటింది. డచ్ జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.

టాస్ గెలిచిన లంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ ను లంక బౌలర్లు హడలెత్తించారు. దాంతో 10 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. అకెర్మన్ 11 పరుగులు చేశాడు. మిగతావారిలో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. లంక బౌలర్లలో లహిరు కుమార 3, వనిందు హసరంగ 3, తీక్షణ 2, చమీర 1 వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 7.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా 24 బంతుల్లో 6 ఫోర్లతో 33 పరుగులు చేశాడు.

ఈ విజయంతో గ్రూప్-ఏలో శ్రీలంక అగ్రస్థానం కైవసం చేసుకుంది. తాను ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయభేరి మోగించింది. టీ20 వరల్డ్ కప్ లో నేటితో తొలి దశ పోటీలు ముగిశాయి. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, నమీబియా.. గ్రూప్-బి నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ ముందంజ వేశాయి.
రేపటి నుంచి సూపర్-12 పోటీలు నిర్వహించనున్నారు. శనివారం జరిగే తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి. ఈ మ్యాచ్ కు అబుదాబి వేదికగా నిలవనుంది. షార్జా ఆతిథ్యమిచ్చే రెండో మ్యాచ్ లో ఇంగ్లండ్, వెస్టిండీస్ పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను ఎల్లుండి పాకిస్థాన్ తో ఆడనుంది.