'రాజా విక్రమార్క' రిలీజ్ డేట్ ఖరారు!

20-10-2021 Wed 12:01
  • కార్తికేయ హీరోగా 'రాజా విక్రమార్క'
  • కథానాయికగా తాన్య రవిచంద్రన్ 
  • దర్శకుడిగా శ్రీ సరిపల్లి పరిచయం 
  • నవంబర్ 12వ తేదీన విడుదల  
Raja Vikramarka Releasing on Nov 12 in theatres
కార్తికేయ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 'చావు కబురు చల్లగా' సినిమా ఫలితంతో అసంతృప్తిగా ఉన్న ఆయన, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో 'రాజా విక్రమార్క' సినిమాను చేశాడు. 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించాడు.

ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కార్తికేయ నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా తాన్య రవిచంద్రన్ నటించింది. యాక్షన్ తో పాటు లవ్ .. రొమాన్స్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబర్ 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, రామజోగయ్య శాస్త్రి - కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా, కార్తికేయ కెరియర్ కి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి..