'దసరా' నుంచి నాని ఫస్టులుక్ .. హీరోయిన్ గా కీర్తి సురేశ్!

15-10-2021 Fri 17:29
  • నాని 29వ సినిమా నుంచి ఎనౌన్స్ మెంట్
  • సినిమా టైటిల్ గా 'దసరా'
  • పక్కా మాస్ లుక్ తో నాని  
  • దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పరిచయం
Dasara movie first look
నాని నుంచి ఇటీవల వచ్చిన 'టక్ జగదీష్' ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ తరువాత ఆయన నుంచి రావడానికి 'శ్యామ్ సింగ రాయ్' రెడీ అవుతోంది. ఇక 'అంటే .. సుందరానికీ' కూడా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ నేపథ్యంలో ఆ తరువాత ప్రాజెక్టును కూడా నాని లైన్లో పెట్టేశాడు. నానీకి ఇది 29వ సినిమా .. విజయదశమి రోజున ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఉంటుందని ముందుగానే చెప్పారు.

అలాగే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఫస్టు లుక్ ను బట్టి నాని ఈ సినిమాలో ఊరమాస్ లుక్ తో కనిపించనున్నాడనే విషయం అర్థమైపోయింది. ఇక ఫస్టు గ్లింప్స్ వలన .. ఈ సినిమాలో ఆయన పాత్ర పక్కా తెలంగాణ యాస మాట్లాడుతుందనే విషయం స్పష్టమవుతోంది. "ఈ దసరా నిరుడు లెక్కుండదు .. ఎట్లయితే గట్లనే" అంటూ శాంపిల్ గా ఓ డైలాగ్ వదిలారు.  

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో, నాని సరసన నాయికగా కీర్తి సురేశ్ కనిపించనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'నేను లోకల్' హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, సముద్రఖని .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.