అప్పట్లో దివ్యభారతితో కలిసి గంజాయి దమ్ము కొట్టాను: బాలీవుడ్ మాజీ నటి సోమీ అలీ

08-10-2021 Fri 21:07
  • డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యన్ అరెస్ట్
  • షారుఖ్ కుటుంబానికి మద్దతు ప్రకటించిన మాజీ నటి
  • డ్రగ్స్ ఎలాంటివో ఓ పిల్లవాడు తెలుసుకుంటే తప్పేంటన్న సోమీ
  • 15 ఏళ్ల వయసులోనే గంజాయి పీల్చానని వెల్లడి
Somy Ali says she was pot smoking with Divya Bharathi

సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. బాలీవుడ్ మాజీ నటి, పాకిస్థాన్ అందాలభామ సోమీ అలీ ఈ వ్యవహారంపై స్పందించింది. ఆర్యన్ ఖాన్ కు, అతడి కుటుంబానికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది. డ్రగ్స్ వాడితే ఎలా ఉంటుంది? ఏమవుతుంది? అనే విషయాలు ఓ పిల్లవాడు తెలుసుకోకూడదా? అని ప్రశ్నించింది.

డ్రగ్స్ వాడకం కూడా వ్యభిచారం వంటిదేనని, ఈ రెండు ఎప్పటికీ తొలగిపోవని పేర్కొంది. "ఈ రెండు అంశాల పట్ల ఎందుకింత వివక్ష? అయినా ఆ పిల్లవాడు ఏంచేశాడని? తెలిసీతెలియని పసితనానికి ప్రతిరూపం లాంటివాడు. ఇక్కడ ఎవరూ పునీతులు కారు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

అంతేకాదు, తాను 15 ఏళ్ల వయసులో తొలిసారిగా గంజాయి దమ్ము కొట్టానని, ఆ తర్వాత 'ఆందోళన్' చిత్రం షూటింగ్ సమయంలో నటి దివ్యభారతితో కలిసి మరోసారి గంజాయి దమ్ము బిగించానని సోమీ అలీ వెల్లడించింది. దీనిపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేసింది. అమెరికాలో అక్కడి ప్రభుత్వాలు డ్రగ్స్ పై 1971 నుంచి యుద్ధం చేస్తున్నాయని, అయినప్పటికీ ఆ దేశంలో ప్రజలకు డ్రగ్స్ ఎంతో సులభంగా లభ్యమవుతున్నాయని సోమీ తెలిపింది.  

డ్రగ్స్ వాడకంపై న్యాయవ్యవస్థ ఆర్యన్ ను ఓ పావులా వాడుకుంటోందని ఆరోపించారు. అకారణంగా ఆ పసివాడు వేదనకు గురవుతున్నాడని తెలిపింది. ఇలాంటి కేసులపై ఇంత తీవ్రస్థాయిలో దృష్టి సారించే బదులు రేపిస్టులు, హంతకులను పట్టుకోవడంపై న్యాయవ్యవస్థ ఎందుకు శ్రద్ధ చూపించదని ప్రశ్నించింది.