IPL 2021: కోహ్లీసేన వరుస విజయాలకు కళ్లెం.. హైదరాబాద్‌కు ఊరట విజయం

  • హైదరాబాద్ ఖాతాలో మూడో విజయం
  • చివరి ఓవర్‌లో ఉత్కంఠ
  • నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్
  • ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు
SRH hold nerve to clinch a thriller

ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊరట విజయం లభించింది. వరుస విజయాలతో ఊపుమీదున్న బెంగళూరు 142 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. తొలుత బ్యాట్‌తోను, ఆ తర్వాత బంతితోను రాణించిన హైదరాబాద్ ఖాతాలో మూడో విజయం చేరడం ఒక్కటే దానికి ఊరట.

సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నా, క్రీజులో డివిలియర్స్ లాంటి ఆటగాడు ఉన్నప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. 137 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించి ఓటమి పాలైంది. దేవదత్ పడిక్కల్ నిలకడైన ఆటతీరు, మాక్స్‌వెల్ మెరుపులు జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి. పడిక్కల్ 52 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.

డివిలియర్స్ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన చివరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 13 పరుగులు అవసరం కాగా, తొలి మూడు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి. అయితే, నాలుగో బంతికి ఏబీ సిక్సర్ కొట్టడంతో ఉత్కంఠ రేగింది. అయితే, ఆ తర్వాత రెండు బంతులను భువీ పకడ్బందీగా సంధించడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ఎస్ఆర్‌హెచ్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువీ, జేసన్ హోల్డర్, సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 44, కెప్టెన్ విలియమ్సన్ 31, ప్రియంగార్గ్ 15, హోల్డర్ 16 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసుకోగా, క్రిస్టియన్ రెండు, చాహల్, గార్టన్ చెరో వికెట్ తీసుకున్నారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం మూడున్నర గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్, సాయంత్రం ఏడున్నర గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌‌లు జరగనున్నాయి.

More Telugu News