మా నాన్నను గెలిపించు.. చెన్నై మ్యాచ్‌లో ధోనీ కుమార్తె ఫొటో వైరల్

05-10-2021 Tue 16:22
  • కొన్నిరోజుల క్రితం ధోనీ సిక్సర్‌ ఫినిష్‌కు ఆశ్చర్యపోయిన జీవా
  • ఢిల్లీతో మ్యాచ్‌లో దేవుడిని ప్రార్థిస్తూ కెమెరాకు చిక్కిన ధోనీ కుమార్తె
  •  ఈ సీజన్‌లో ఇదే అద్భుతమైన ఫొటో అంటూ నెటిజన్ల కామెంట్లు
Dhonis daughter Ziva prays while watching CSK vs DC IPL match pics viral
మొన్నామధ్య సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ను ధోనీ భారీ సిక్సర్‌తో ముగించిన సంగతి తెలుసు కదా. అప్పుడు ధోనీ కుమార్తె జీవా ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టిన వీడియో బాగా వైరల్‌ కూడా అయింది. ఢిల్లీ, చెన్నై మ్యాచ్‌ సందర్భంగా కూడా జీవా చేసిన ఒక పని ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు గెలవాలని జీవా దేవుడిని కోరుకుంటూ కెమెరాకు చిక్కింది.

దీన్ని చూసిన నెటిజన్లు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇదే అద్భుతమైన ఫొటో అని మెచ్చుకుంటున్నారు. తండ్రి గెలుపు కోసం కుమార్తె అమాయకంగా దేవుడిని ప్రార్థిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే జీవా ప్రార్థనలు ఏవీ ఫలించినట్లు లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ధోనీ సారధ్యంలోని చెన్నై జట్టు ఓడిపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లో అంబటి రాయుడు (55) అర్థశతకంతో రాణించాడు. అయితే ఈ స్వల్ప లక్ష్యం ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ల ముందు నిలవలేదు. ధావన్ (39), హెట్‌మెయర్ (28 నాటౌట్‌) ధాటికి 19.4 ఓవర్లలో టార్గెట్ ఛేజ్ చేసిన ఢిల్లీ జట్టు విజయకేతనం ఎగురవేసింది.