అమిత్ షాకు అదానీ శిష్యుడు కావడం వల్లే జగన్ భయపడుతున్నారు: సీపీఐ నారాయణ
- డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ, కేంద్రం కూడా భాగస్వాములే
- తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధుల భాష ‘బిగ్‌బాస్’లో కంటే దారుణం
- యువ నేతలు మా పార్టీ నుంచి వెళ్లిపోతుండడంపై ఆత్మపరిశీలన అవసరం
మాదక ద్రవ్యాల దందా, ఇతర సమస్యలపై ఢిల్లీలో జరిగే సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. ముంద్రా పోర్టు నుంచి విజయవాడకు మాదక ద్రవ్యాలు వచ్చినప్పటికీ అదానీని జగన్ ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అదానీ శిష్యుడు కావడం వల్లే జగన్ భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగానే అమ్మేస్తున్నారని, అందులో భాగంగానే గంగవరం పోర్టు అదానీ పరమైందని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధుల భాష రియాలిటీ షో బిగ్‌బాస్‌లో కంటే దారుణంగా ఉందన్నారు. ఏపీలో ఇది మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నయ్య కుమార్ లాంటి యువ నేతలు తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్న విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని నారాయణ అన్నారు.