రెండు, మూడు రోజుల్లో సాధారణ వార్డుకు షిఫ్ట్ కానున్న సాయితేజ్

14-09-2021 Tue 11:31
  • సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్
  • అపోలో ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స 
  • సాయితేజ్ కోలుకుంటున్నారన్న వైద్యులు
Sai Dharam Tej will be shifted to general ward in a couple of days

సినీ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ స్కిడ్ అవడంతో కిందపడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన స్పృహ కోల్పోయారు. తొలుత ఆయనను మెడికవర్ ఆసుపత్రికి, ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన కాలర్ బోన్ ఫ్రాక్చర్ కాగా... వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు.

సాయితేజ్ కోలుకుంటున్న నేపథ్యంలో, ఆయన హెల్త్ బులెటిన్ ను అధికారికంగా విడుదల చేయడాన్ని వైద్యులు ఆపేశారు. అయితే వైద్యులు మాట్లాడుతూ, సాయితేజ్ కోలుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకి తరలిస్తామని చెప్పారు. మరోవైపు సాయితేజ్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఆసుపత్రికి తరలి వస్తున్నారు. నిన్న సాయంత్రం చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి సాయితేజ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు.