Prime Minister: ఈ నెల 24న అమెరికాకు ప్రధాని

Prime Minister Narendra Modi To Leave USA On 24th To Attend Quad Summit
  • క్వాడ్ సదస్సుకు హాజరు
  • తొలిసారి ప్రత్యక్షంగా సమావేశాలు
  • వ్యాక్సిన్ కార్యక్రమంపై చర్చ
  • ఆ మర్నాడు ఐరాస సదస్సులో ప్రధాని ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 24న అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న క్వాడ్ సదస్సులో ఆయన పాల్గొంటారు. దాంతో పాటు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల అత్యున్నత సమావేశంలోనూ పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రధాని పర్యటనకు సంబంధించి ప్రకటనను విడుదల చేసింది.

కరోనా కారణంగా ఇన్నాళ్లూ ఆన్ లైన్ లోనే జరిగిన క్వాడ్ సమావేశాలు.. తాజాగా తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సూగాలూ సమావేశాలకు హాజరవుతారు.

సదస్సులో భాగంగా క్వాడ్ వ్యాక్సిన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తారని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న సమస్యలు, వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాలు, అనుసంధానత, మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ, తీర ప్రాంత రక్షణ, విపత్తు ఉపశమన సాయం, పర్యావరణ మార్పులు, విద్య వంటి వాటిపైనా చర్చిస్తారని పేర్కొంది.

నాలుగు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, కొవిడ్ పై పోరులో పరస్పర సహకారం వంటి విషయాలతో పాటు ఇండో పసిఫిక్ రీజియన్ లో స్వేచ్ఛ, ఆ ప్రాంతాన్ని ఓపెన్ గా ఉంచడం వంటి విషయాలపైనా చర్చిస్తారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ నెల 25న న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ సమావేశాల్లో అత్యున్నత స్థాయీ చర్చలో మోదీ ప్రసంగించనున్నారు.
Prime Minister
Narendra Modi
USA
Quad
Japan
India
Australia

More Telugu News