Narayan Rane: కేంద్రమంత్రి నారాయణ్ రాణేను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు!

  • ఉద్ధవ్ థాకరేపై విమర్శల ఫలితం
  • చెంప చెళ్లుమనిపించేవాడ్నన్న రాణే
  • రాణేపై నాలుగు ఎఫ్ఐఆర్ ల నమోదు
  • మహారాష్ట్రలో శివసేన వర్సెస్ బీజేపీ
Maharashtra police arrests union minister Narayan Rane

కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మహారాష్ట్ర పోలీసులు ఈ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ నారాయణ్ రాణేపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నాసిక్ లో బీజేపీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి కూడా చేశారు. ఈ దాడికి పాల్పడింది శివసేన కార్యకర్తలు అని భావిస్తున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల బీజేపీ, శివసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

'సీఎం ఉద్ధవ్ థాకరేను చెంప పగలగొట్టాలి' అంటూ రాణే చేసిన వ్యాఖ్యలపై అనేక పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతకుముందు కేంద్రమంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యానిస్తూ... స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం ఏదో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి తెలియకపోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. "ఆ సమయంలో నేను అక్కడుంటే చెంప చెళ్లుమనిపించేవాడ్ని" అని రాణే ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యల ఫలితంగా రాణేపై నాసిక్, పూణేలో రెండు ఎఫ్ఐఆర్ లు, రాయ్ గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో మరో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. దాంతో, నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే కేంద్రమంత్రిని అరెస్ట్ చేసి తమకు అప్పగించాలంటూ రత్నగిరి జిల్లా ఎస్పీకి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాణేను రత్నగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News