Nara Lokesh: వైసీపీ నేతలను తాలిబన్లతో పోల్చిన టీడీపీ నేత నారా లోకేశ్

Nara Lokesh compares YSRCP leaders with Talibans
  • తన ఇంటిపక్కనున్న పేదల ఇళ్లను జగన్ కూల్చేశారు
  • భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారు
  • ఆదివాసీల చట్టాలను కాలరాస్తున్నారు
వైసీపీ నేతలను తాలిబన్లతో పోల్చారు టీడీపీ నేత నారా లోకేశ్. ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు... అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లని మించిపోయారని అన్నారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదని నిరుపేదల ఇళ్లను జగన్ కూల్చేశారని మండిపడ్డారు. నిన్న రాత్రి భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని విమర్శించారు.

 తనకు రూ. 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి... తన ఇంటి దగ్గరున్న భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రొక్లెయినర్లతో పెకిలించిన భరతమాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని, చేసిన మూర్ఖపు పనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని లోకేశ్ దుయ్యబట్టారు. తమ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన రంపచోడవరం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దారుణమని అన్నారు. చర్చల పేరుతో ఆహ్వానించి, పోలీసులతో నిర్బంధించి, నేరం చేసిన వాళ్లలా నేలపై గిరిజన ప్రతినిధులను కూర్చోబెట్టి తీవ్రంగా అవమానించడం జగన్ రెడ్డి అధికార దర్పానికి పరాకాష్ఠ అని అన్నారు. గిరిజనుల అభ్యున్నతికి పాల్పడాల్సిన అధికారే గిరిపుత్రుల పాలిట అరాచకంగా ప్రవర్తించడం క్షమించరాని నేరమని చెప్పారు.
 
గిరిజనుల హక్కులను కాపాడాలని, వారికి రక్షణగా ఉన్న చట్టాలు, జీవోలను పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. బాక్సైట్ అక్రమ మైనింగ్ దందాను తక్షణమే నిలిపివేయాలని అన్నారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News