Tolo News: మా చానల్ ఇంకా నడుస్తుండడం ఆశ్చర్యకరమే: ఆఫ్ఘన్ టోలో న్యూస్ అధినేత

Tolo News channel owner Saad Mohseni opines on media freedom in Taliban regime
  • ఆఫ్ఘన్ ను చేజిక్కించుకున్న తాలిబన్లు
  • మీడియా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని ప్రకటన
  • ఇప్పటివరకు బాగానే ఉందన్న టోలో న్యూస్ అధినేత
  • దీర్ఘకాలంలో తమ పరిస్థితి ఏంటో చెప్పలేమని వెల్లడి
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ జెండా ఎగిరిన నేపథ్యంలో అక్కడి మీడియా స్వేచ్ఛపై తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. తాలిబన్ల ఏలుబడిలో స్వతంత్ర మీడియా సంస్థలు ఎంతమేరకు మనుగడ సాగించగలవన్నది చర్చనీయాంశంగా మారింది. మీడియా స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదని తాలిబన్లు ప్రకటించినా, గత అనుభవాల దృష్ట్యా మీడియా సంస్థల్లో నమ్మకం కలగడంలేదు.

ఈ అంశంపై ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే టోలో న్యూస్ చానల్ అధినేత సాద్ మొహ్సేనీ స్పందించారు. తాలిబన్ల హవా మొదలై కొన్నిరోజులు గడిచిందని, ఇప్పటికీ తమ చానల్ నడస్తుండడం ఆశ్చర్యకరమేనని అన్నారు. ప్రస్తుతం తాము అనుభవిస్తున్న మీడియా స్వేచ్ఛ ఎంతకాలమన్నది చెప్పలేమని వ్యాఖ్యానించారు.

ఇటీవల రాజధాని కాబూల్ ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్లు టోలో న్యూస్ చానల్ కార్యాలయాన్ని సందర్శించారు. తాలిబన్లు తమ చానల్ కార్యాలయానికి వస్తారని ఏమాత్రం ఊహించలేకపోయామని, ఎంతో మర్యాదపూర్వకంగానే నడుచుకున్నప్పటికీ, తమ చానల్ భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలు తీసేసుకున్నారని సాద్ వెల్లడించారు.

"మా చానల్ కార్యక్రమాలు ఇంకా ప్రసారం అవుతున్నాయని ఆలోచిస్తేనే కాస్తంత విస్మయం కలుగుతోంది. స్థానిక వార్తా సంస్థల జోలికి రాబోమని తాలిబన్లు హామీ ఇచ్చారు. ఇప్పటివరకు బాగానే ఉంది. దీర్ఘకాలంలో ఏం జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు. మీడియా సంస్థలతో, పాత్రికేయులతో వారు ఎలా నడుచుకుంటారన్నది చెప్పలేం" అని వివరణ ఇచ్చారు.
Tolo News
Saad Mohseni
Taliban
Media Freedom
Afghanistan

More Telugu News