గోవా హోటల్లో శవమై కనిపించిన సినీ నటి అలెగ్జాండ్రా

23-08-2021 Mon 15:01
  • ఈ నెల 20న మృతదేహం గుర్తింపు
  • ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
  • బోయ్ ఫ్రెండ్ తో మనస్పర్థలు వచ్చాయని సమాచారం
Actress Alexandra dead body found in Goa
సినీ నటి, మోడల్ అలెగ్జాండ్రా జావి గోవాలోని హోటల్లో శవమై కనిపించింది. ఈ నెల 20న ఆమె బస చేసిన హోటల్ గదిలో మృతదేహాన్ని గుర్తించారు. రష్యా జాతీయురాలైన అలెగ్జాండ్రా వయసు 24. ఆమెది ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు.

మరోవైపు తన బోయ్ ఫ్రెండ్ తో మనస్పర్థలు రావడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లినట్టు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బోయ్ ఫ్రెండ్ ను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు చెన్నైకి చెందిన ఫొటోగ్రాఫర్ పై 2019లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అతన్ని కూడా విచారించే అవకాశం ఉంది.

రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి, నటించిన 'కాంచన 3' చిత్రంలో అలెగ్జాండ్రా నటించింది. ప్రతీకారం తీర్చుకునే దెయ్యం పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ సినిమాలో ఒవియా, నిక్కీ తంబోలిలు ఇతర హీరోయిన్ల పాత్రలను పోషించారు.