Robert O Neill: తొమ్మిది మందినివ్వండి చాలు... ఆఫ్ఘన్ నుంచి అమెరికన్లందరినీ తీసుకొస్తా: లాడెన్ ను హతమార్చిన మాజీ నేవీ సీల్ ధీమా

Former US Navy Seal Robert O Neill comments on Afghan crisis
  • 2011లో లాడెన్ హతం
  • మూడు రౌండ్లు కాల్పులు జరిపిన రాబర్ట్ ఓ నీల్
  • తాజాగా ఆఫ్ఘన్ పరిస్థితులపై స్పందన
  • కనిపించిన వాళ్లందరినీ కాల్చేస్తానని వెల్లడి
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ ఖైదా వ్యవస్థాపక అధినేత ఒసామా బిన్ లాడెన్ 2011 మే 2న అమెరికా నేవీ సీల్స్ ఆపరేషన్ లో హతుడయ్యాడు. ఈ అత్యంత రహస్య ఆపరేషన్ లో పాల్గొన్న వారిలో రాబర్ట్ ఓ నీల్ ఒకరు. లాడెన్ ను తరుముకుంటూ వెళ్లి ఆయన తలపై మూడు రౌండ్లు కాల్పులు జరిపి, ఆయన మరణానికి కారకుడయ్యింది రాబర్ట్ ఓ నీలే. 60 సెకన్లలో లాడెన్ ప్రస్థానానికి ముగింపు పలికాడు.

తర్వాత కాలంలో రాబర్ట్ ఓ నీల్ ను ఓ గొడవ నేపథ్యంలో సీల్స్ బృందం నుంచి తప్పించారు. తాజాగా, ఆఫ్ఘన్ సంక్షోభం నేపథ్యంలో ఈ మాజీ సీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఫాక్స్ న్యూస్ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న రాబర్ట్ ఓ నీల్ మాట్లాడుతూ, తనకు తొమ్మిది మందిని ఇస్తే చాలని, ఆఫ్ఘనిస్థాన్ లో చిక్కుకుపోయిన అమెరికన్లందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తానని చెప్పాడు. ఆఫ్ఘన్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్లి కనిపించిన వాళ్లను కనిపించినట్టు పిట్టల్లా కాల్చేసి అమెరికన్లకు విముక్తి కలిగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఇదేమంత కష్టసాధ్యం కాదని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం అమెరికా దళాల ఉపసంహరణ వైఫల్యానికి బైడెన్ పాలనా యంత్రాంగంతో పాటు కొందరు ఆర్మీ, నేవీ ఉన్నతాధికారులు కారణమని చెప్పాడు. ఈ విషయంలో కనీసం 30 మంది సైనికాధికారులు తమ పదవులకు రాజీనామా చేయాలని, లేదా వారిని పదవుల నుంచి తప్పించాలని రాబర్ట్ ఓ నీల్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, రాజకీయనేతలు అసమర్థులు అని కూడా వ్యాఖ్యానించాడు. ఇలాంటి వారి వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని రాబర్ట్ ఓ నీల్ విమర్శించాడు.
Robert O Neill
Afghanistan
Taliban
Americans
USA
Osama Bin Laden

More Telugu News