కాల్పులతో దద్దరిల్లుతున్న కాబూల్.. గగనతలం మూసివేత.. విమానాలను రద్దు చేసిన భారత్

Afghan Airspace Closed For Civilian Planes
  • ఎయిర్ పోర్టులో భయానక పరిస్థితులు
  • కేవలం సైన్యం అవసరాలకే గగనతలం
  • చిక్కుకున్న వివిధ దేశాల ప్రజలు
  • ఢిల్లీ–అమెరికా విమానాల దారిమళ్లింపు
  • దోహాలో హాల్టింగ్
  • ఇంధనం నింపుకుని మళ్లీ ప్రయాణం
కాబూల్ నగరం కాల్పులతో మోగిపోతోంది. దీంతో మామూలు వాణిజ్య విమానాల ప్రయాణానికి అక్కడి గగనతలాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కేవలం సైనిక అవసరాల కోసమే ఎయిర్ స్పేస్ ను వినియోగించుకోనున్నారు. దీంతో వివిధ దేశాల పౌరుల తరలింపునకు ఆటంకం ఏర్పడింది.


అక్కడి భారత పౌరులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు విమానాలను కాబూల్ కు పంపాలని అంతకుముందు నిర్ణయించింది. ఇవాళ రాత్రి 8.30 గంటలకు పంపాలని ముందుగా అనుకున్నా.. ఆ తర్వాత పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించి మధ్యాహ్నం 12.30 గంటల కల్లా కాబూల్ కు పంపించాలని నిర్ణయించింది. కానీ, ఇప్పుడు ఆ గగనతలాన్ని మూసివేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాబూల్ కు పంపించాలనుకున్న రెండు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.

కాగా, అమెరికా వెళ్లాల్సిన లేదా అక్కడి నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాలన్నింటినీ ఆఫ్ఘన్ గగనతలం మీది నుంచి కాకుండా దోహా మీదుగా మళ్లిస్తున్నట్టు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. దోహా హాల్టింగ్ లో ఇంధనం నింపుకుని ప్రయాణాన్ని మొదలుపెడతాయని చెప్పాయి. ఇప్పటికే షికాగో నుంచి వస్తున్న విమానాన్ని దారి మళ్లించారు.

ఇటు అమెరికాతో పాటు వివిధ దేశాలు తమ పౌరులను తీసుకెళ్లేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నా ఇప్పుడు గగనతలాన్ని మూసివేయడంతో అక్కడే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Go Back to Shorts
Afghanistan
Taliban
Kabul
Airport
Air India

More Telugu News