జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదు: చంద్రబాబు

15-08-2021 Sun 20:21
  • గుంటూరులో రమ్య అనే విద్యార్థిని హత్య
  • సీఎం సోదరికే రక్షణ లేదన్న చంద్రబాబు
  • మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుందని వ్యాఖ్యలు
  • 500 దాడులు, అఘాయిత్యాలు జరిగాయని వెల్లడి
Chandrababu responds on BTech Student Ramya murder case
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యను శశికృష్ణ అనే యువకుడు హత్య చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదని విచారం వ్యక్తం చేశారు. గుంటూరులో దళిత విద్యార్థిని హత్య తీవ్రంగా కలచివేసిందని అన్నారు. సీఎం నివాసానికి దగ్గర్లో ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

వైసీపీ పాలనలో ఇప్పటిదాకా 500కి పైగా మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నాగానీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని విమర్శించారు. సీఎం సోదరి సునీతారెడ్డికి ప్రాణహాని ఉందంటే, సామాన్యులకు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేమి భద్రత దొరుకుతుందని అన్నారు. రమ్య కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.