Harish Rao: పెంచి పెద్ద చేసిన కొడుకు గుండెల మీద తంతే ఎలా ఉంటుందో ఈటల తీరు అలా ఉంది!: హరీశ్ రావు మండిపాటు

Harish Rao comments on Etela Rajenderr
  • ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు
  • ఓటమి భయంతో ఈటల మాట తూలుతున్నాడు
  • శ్రీనివాస్ ఘన విజయం సాధించడం ఖాయం
బీజేపీ నేత ఈటల రాజేందర్ పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్ ను... ఈటల రాజేందర్ 'రా' అంటున్నాడని దుయ్యబట్టారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన మాట మారిందని అన్నారు. ఓటమి భయంతో మాట తూలుతున్నాడని విమర్శించారు. పెంచి పెద్ద చేసిన కొడుకు గుండెల మీద తంతే ఎలా ఉంటుందో ఈటల తీరు అలాగే ఉందని అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరపున ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

హుజూరాబాద్ లో లభించిన ఘన స్వాగతం చూస్తుంటే... గెల్లు శ్రీనివాస్ ఘన విజయం సాధించబోతున్నారని అర్థమవుతోందని హరీశ్ అన్నారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల తనను చూసి ఓటు వేయమని జనాలను కోరుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆత్మవంచన చేసుకుని బీజేపీలో ఉన్న ఈటల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే పనులేమీ చేయని ఈటల... ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తారని ప్రశ్నించారు. గెల్లు శ్రీనివాస్ కు రాష్ట్ర కేబినెట్ ఆశీర్వాదం ఉందని... హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదం కూడా కావాలని హరీశ్ అన్నారు.
Harish Rao
KCR
TRS
Etela Rajender
BJP
Huzurabad

More Telugu News