Harish Rao: సానుభూతి కోసం ఒళ్లంతా పట్టీలు కట్టుకుని తిరుగుతారు.. వారి మాయలో పడొద్దు: ఈటలపై హరీశ్‌రావు సెటైర్లు

  • హుజూరాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం
  • ఈటల చక్రాల కుర్చీలో ప్రచారానికి వస్తారన్న మంత్రి
  • బీజేపీ ఎత్తుగడలో ఇది కూడా భాగమన్న హరీశ్‌రావు
minister harish rao satires on etela rajender

బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోమారు విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల వేళ దొంగనాటకాలకు తెరతీశారని మండిపడ్డారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ప్రచారంలో గాయపడినట్టు, అనారోగ్యం పాలైనట్టు ఒళ్లంతా పట్టీలు కట్టుకుని తిరుగుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తారని విమర్శించారు. ఈటల చక్రాల కుర్చీలో ప్రచారానికి వచ్చి సానుభూతి కోసం ప్రయత్నిస్తారని, ఆయన మాయలో పడొద్దని హితవు పలికారు. బీజేపీ ప్రచార ప్రణాళిక ఎత్తుగడలో ఇది కూడా భాగమన్నారు.

సిద్దిపేటలో నిన్న హుజూరాబాద్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు.  బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందని, తాము మాత్రం ఈ ఏడేళ్లలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. త్వరలోనే మరో 70 వేల వరకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. హుజూరాబాద్‌లో పార్టీ కేడర్ మొత్తం కేసీఆర్ వెంటే ఉందన్న హరీశ్‌రావు.. ప్రభుత్వ సంస్థల విక్రయానికి ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసిన బీజేపీ.. బీసీల సంక్షేమానికి శాఖను ఎందుకు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News